Accident:

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అధిక బరువు.. అతివేగంతో మృత్యుశకటంలా లారీ దూసుకొచ్చింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని ఆశగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ హఠాత్‌ పరిణామంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40మందికి పైగానే ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. 30మంది వరకు గాయాలపాలైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌తోపాటు ఎస్పీలు ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కనుమ రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర (Accident)రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 40 నుంచి 45 మందితో చిత్తూరు నుంచి పలమనేరుకు బస్సు బయలుదేరింది. చిత్తూరు–బెంగళూరు హైవేలో మొగిలి ఘాట్‌(కనుమ దారిలో) వద్దకు వచ్చింది. అదే సమయంలో పలమనేరు నుంచి ఐరన్‌(ఇనుపరాడ్లు)తో వస్తున్న లారీ అదుపు తప్పింది. దీంతో ఎదురుగా ఎదురుగా వస్తున్న బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు మరో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో భయానక వాతావరణం..

ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనా స్థలంలో భయానకంగా మారింది. లారీ, బస్సు ముందు భాగాలు నుజునుజ్జుఅయ్యాయి. ప్రయాణికులు చెల్లాచెదురు అయ్యారు. అప్పటివరకు ఆనందంగా బస్సులో ప్రయాణిస్తున్న వారి హాహాకారులు కంటతడి పెట్టించాయి. ప్రమాద సమయంలో ఇరువైపులా నుంచి ఎలాంటి పెద్ద వాహనాలు రాలేదు. లేదంటే ప్రాణనష్టం మరింత పెరిగేది. మృతుల శరీరాలు ఇనుప చువ్వల్లో చిక్కుకోవడం చూపనులను కలిచివేసింది. వాహనదారులు క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసేందుకు సహకరించారు. అనంతరం వారిన పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది.

ముఖ్యమంత్రి దిగ్ర్భాంతి

రోడ్డు ప్రమాద ఘటనపై ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే ఉన్నతాధికారుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *