Ts: jobs notification : తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆగమేఘాల మీద ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.
ఇప్పటికే మెగా డీఎస్సీ పేరుతో భారీగా టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీర్చే లక్ష్యంగా అడుగులు వేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచన మేరకు 2021 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నం.98 విడుదల కూడా చేసింది.
కొత్తగా గ్రీన్‌సిగ్నల్ (Telangana jobs notification )ఇచ్చిన పోస్టుల్లో ముఖ్యంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీతో ఏటా సర్కారుపై అదనంగా రూ.634 కోట్ల భారం పడుతుందని తెలుస్తోంది. మెడికల్ కాలేజీల్లోని అధ్యాపకుల నియామకాలన్నీ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీల ద్వారా సత్వరమే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. కాలేజీల వెబ్‌సైట్ల వివరాలు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అన్ని కాలేజీల్లో ఈ నెల 16న వాక్–ఇన్–ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
ఖాళీలు ఇలా..
- ప్రొఫెసర్ పోస్టులు 498 ఉన్నాయి. వేతనం రూ.1.90 లక్షలు
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 786 ఉన్నాయి. వేతనం రూ.1.50లక్షలు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1459 ఉన్నాయి. వేతనం రూ.1.25లక్షలు
- సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 1201 ఉన్నాయి. వేతనం రూ. 92,575
- ట్యూటర్స్ పోస్టులు 412 ఉన్నాయి. వేతనం రూ.55వేలు
త్వరలో మరిన్ని పోస్టులు..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ఉద్యోగాల భర్తీల హామీలను తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. ఇదే మాదిరిగా రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పోస్టును భర్తీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టిచూస్తూ మరిన్ని నోటిఫికేషన్లు రావడం ఖాయమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇదే మంచి అవకాశమని, నిరుద్యోగులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రిపరేషన్ పెంచాలని సూచిస్తున్నారు.