-
లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు
-
మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
-
తీహార్ జైలుకు.. జైలునుంచి 4పేజీల లేఖ విడుదల
-
కుట్రతో ఇరికించారని ఆవేదన
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు మళ్లీ చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) విజ్జప్తి మేరకు మరో 14 రోజుల (ఈనెల 23 వరకు ) జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మంగళవారం ఢిల్లి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. 2024 మార్చి 26న కవితకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, ఆ గడువు ముగియడంతో నేడు(2024, ఏప్రిల్ 9) ఈడీ ఆమెను కోర్టులో హాజరు పరిచింది. కేసు విచారణలో కవిత సహకరించడం లేదని, మరింత విచారణకు మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఇప్పుడే కవితకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఇదిలా ఉండగా కోర్టుకు వెళ్తున్న సమయంలో కవిత జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, కోర్టులో వాదనలు జరుగుతుండగానే సీబీఐ అధికారులు ఆమెను కోర్టును తరలించే ఏర్పాటు చేయడం విశేషం. కోర్టు తీర్పు అనంతరం కవిత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ వెళ్లి పోయారు.
-
కోర్టు నుంచి 4పేజీల లేఖ..
- కోర్టు తీర్పు అనంతరం తీహార్ జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత అక్కడి నుంచే నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. ఇందులో ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. రెండున్నర ఏళ్లలో ఈడీ, సీబీఐ విచారణలో తాను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని, రాజకీయ కుట్రలతోనే తనను కేసులో ఇరికించారని పేర్కొన్నారు. తాను ఎలాంటి ఆర్థిక కుట్రలకు పాల్పడతేదని, ఈకేసులో తాను కేవలం బాధితురాలని వెల్లడించారు. తాను తప్పు చేసినట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వేరేవారి స్టేట్ మెంట్ ఆధారంలో తనపై కేసు నమోదు చేసి, బలి పశువును చేశారని పేర్కొన్నారు.