SC RESERVATION: ఎస్సీ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ న్యాయబద్ధమేనని సుప్రీం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకునే అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కినట్టయింది. వర్గీకరణ సాధ్యకాదని 2004లో ఐదుగురు సభ్యులు వెల్లడించిన తీర్పును తాజాగా సుప్రీం ధర్మాసనం వెల్లడింది. సీజేఐ జస్టీస్ డి.వై.చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది ఉప వర్గీకరణ వీలుకాదని పేర్కొనగా, మిగతా సభ్యులు వర్గీకరణ సాధ్యమేనంటూ స్పష్టం చేశారు. దీంతో 6:1 మెజారిటీతో ఎస్సీ వర్గీకరణ తీర్పును వెల్లడించారు. దీంతో ఎస్సీ వర్గాలు సంబరాల్లో మునిగాయి.
పంజాబ్ చట్టంతో వివాదం
ఎస్సీ వర్గీకరణ రగడ ఇప్పట్లో పుట్టింది కాదు. 2006లో అప్పటి పంజాబ్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో భాగంగా 50శాతం ఇవ్వాలని భావించింది. అయితే ఇందులో వాల్మీకీ, మజహబీ సిక్కు సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది. పంజాబ్ తెచ్చిన ద పంజాబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్షేన్ ఇన్ సర్వీసెస్) యాక్ట్ 2006ను వ్యతిరేకిస్తూ పలు పిటీషన్లు సుప్రీ కోర్టు కు వచ్చింది. ఇందులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిటీషన్‌గా కూడా ఉన్నారు. అయితే ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పును వెలువడించింది. దీనిని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం 2011లో సుప్రీంకోర్టు(SC RESERVATION )అప్పీలుకు వెళ్లింది. ఇతర పిటీషనర్లు కూడా వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు 2020 ఆగస్టు 27న జస్టిస్ అరుణ్‌మిశ్రా(ప్రస్తుతం రిటైర్డ్) ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం పూర్తిస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ బేలా, జస్టిస్ ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ విశ్రా, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రా ధర్మానసం విచారణ చేపట్టి గురువారం తీర్పును వెలవడించింది.
ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్..
ఈ కేసులో పిటీషనర్లు 2004నాటి ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కేసులో సుప్రీం ఐదుగురు ధర్మాసనం తీర్పును ఊటంకించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణ (చట్టం ముందు అందరూ సమానులే)ను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈవీ చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తూ గురువారం సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.