REVANTH REDDY -KCR: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు కేసీఆర్ కాలు విరిగింది. దాంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకుని, కొద్దికాలం రెస్టు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆలస్యంగానే చేశారు. చికిత్స తర్వాత కేసీఆర్ ఒకటి రెండు బహిరంగ సభల్లో ప్రసంగించినా.. ఆ తర్వాత మళ్లీ పెద్దగా బయటికి వచ్చిన దాఖలాలు లేవు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె.తారకరామారావు అంతాతానై పార్టీ వ్యవహారాలు నడిపిస్తునానరు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ దూకుడు ప్రదర్శించారు. ఈక్రమంలోనే కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఇరుకున పడింది. ఈక్రమంలో కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు. ఆతర్వాత ఆమెకు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
READ MORE: సీఎం ప్లాన్ -బి సక్సెస్ అయిందా..
ఇన్నాళ్లు కేటీఆర్ అండ్ కోపై కౌంటర్లు ఇచ్చిన సీఎం ఇక లాభం లేదనుకున్నారో ఏమో.. ఏకంగా కేసీఆర్ టార్గెట్‌గానే బహిరంగ సభల్లో ఏకిపారేస్తున్నారు. కేసీఆర్‌పైనే నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఫాంహౌస్ వీడి బయటికి రావాలని, అధికారం ఉంటేనే ప్రజా క్షేత్రంలోకి వస్తావా.. అంటూ బహిరంగ సవాల్ విసురుతున్నారు. అధికారంలో లేకపోయిన నిత్యం ప్రజల్లో ఉంటున్న తమ అధినేత రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలంటూ హితువులు చెబుతున్నారు.
READ MORE: సెల్ఫ్‌గోల్‌లో కాంగ్రెస్.. సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు
లాజిక్ ఇదేనా..
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా.. సీఎం రేవంత్ రెడ్డి-కేసీఆర్(REVANTH REDDY -KCR)పై విమర్శలు గుప్పిస్తుండడం, ఆయన బయటికి ఎందుకు రావాలంటూ సవాళ్లు విసురుతుండడంతో బీఆర్‌ఎస్ క్యాడర్ ఖంగుతింటోంది. ఇన్నాళ్లు అనారోగ్య సమస్యల కారణంగానే కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారని మెజారిటీ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కానీ, రేవంత్ వ్యాఖ్యలతో ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. నిజంగానే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదనే చర్చ కూడా సాగుతోంది. కనీసం కేసీఆర్ మీడియా సమావేశాలు కూడా పెట్టకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. సీఎం నేరుగానే విమర్శించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అయోమయంలో పడుతున్నారు. అసలేం జరుగుతుందో అన్న ఆలోచనలో పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు వ్యతిరేక సంకేతాలు వెళ్తాయన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా ఆయన జనంలోకి రాకుండా కాంగ్రెస్ మరింత దూకుడుపెంచే ప్రమాదమూ లేకపోలేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు బీఆర్‌ఎస్‌ను కలవరపెడుతూనే ఉన్నాయి. ఇకనుంచి రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి.